హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : స్పౌజ్ బదిలీల్లో భాగంగా 13 జిల్లాల భాషాపండితులు, పీఈటీల బదిలీలకు బ్రేక్‌పడింది. ఏండ్లుగా వీరి బదిలీలకు మోక్షం లభించడంలేదు. మంత్రులను కలిసినా, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బాధితులు రోజుకు 200-300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగబాధ్యతలు, పిల్లల చదువులను సమన్వయం చేసుకోలేని పరిస్థితి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర (ఆర్‌యూపీపీ టీఎస్) అధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ప్రతినిధులు ఆదివారం ఎంపీ మల్లు రవిని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. 13 జిల్లాల్లో మిగిలిపోయిన భాషాపండితులు, పీఈటీలను బదిలీ చేసి, భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించి, వారి కుటుంబాల్లో సంతోషం నింపాల్సిందిగా కోరారు.