హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): బదిలీలు, ప్రమోషన్లలో 89 చోట్ల తప్పులు జరిగాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు. వాటిని కూడా పరిషరిస్తున్నట్టు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల్లో వారంలో రెండుసార్లు మెడిటేషన్ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. తరగతుల నిర్వహణకు బ్రహ్మకుమారీస్ సంస్థతో సొసైటీ అవగాహన కుదుర్చుకుందని, గురుకుల టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ణానాన్ని గురుకుల విద్యార్థులకు అందించేందుకు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సంస్థల వలంటీర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.
వెబ్సైట్లో ‘అసిస్టెంట్ సర్జన్’ అభ్యర్థుల జాబితా
హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ సర్జన్(క్లాస్-ఏ, క్లాస్-బీ) పోస్టులకు ఎంపికైన 171మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటనలో తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా, వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
31న ‘టీపీఎస్సీ’ వెరిఫికేషన్
హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): గ్రౌండ్ వాటర్ శాఖలో నాన్ గెజిటెడ్ క్యాటగిరీ సాధారణ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను 31న నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10.30కు నిర్వహించనున్నట్టు కార్యదర్శి నవీన్ నికోలాస్ ప్రకటనలో తెలిపారు. 30, 31న వెబ్ ఆప్షన్స్ లింకు అందుబాటులో ఉం టుందని పేర్కొన్నారు. అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పెట్టినట్టు తెలిపారు. అభ్యర్థుల చెక్‌లిస్ట్, అటెస్టెడ్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకొని, దాని ఆధారంగా ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
నేడు ఆర్‌అండ్‌బీపై సీఎం సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): రోడ్లు, భవనాల శాఖకు చెందిన వివిధ ప్రాజక్టులు, అభివృద్ధి పనులపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. రీజనల్ రింగురోడ్డు భూసేకరణ పురోగతిపై అధికారులతో చర్చించనున్నారు. ఇందులో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు.