Rajnath Singh | హైదరాబాద్లో రహదారుల విస్తరణతో పాటు ఇతర అవసరాలకు రక్షణ భూములు 2500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం సోమవారం సమావేశమయ్యారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (RCI) ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ భూములు తమకు అవసరమని.. ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు తమకు అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున అనుమతులు పునరుద్ధరించాలని.. లేదంటే తాజాగా మంజూరు చేయాలని కోరారు.