హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్ బదిలీ వేళ ఆ సంస్థ యూనియన్ నాయకుడు జాక్‌పాట్ కొట్టినట్టు తెలిసింది. బదిలీ కోసం ఏడాదిగా చేస్తున్న ఆయన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించినట్టు సమాచారం. పాత తేదీతో ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సివిల్ సప్లయ్‌లో (Civil Supplies) జోరుగా చర్చ జరుగుతున్నది. ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గోపీకృష్ణను రంగారెడ్డి నుంచి నల్లగొండ డీఎంగా బదిలీ చేసినట్టు తెలిసింది. బదిలీ అయిన కమిషనర్ చౌహాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్తున్నారు. కమిషనర్ బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఈ తతంగం నడిచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో యాదాద్రి డీఎంగా విధులు నిర్వర్తించిన సమయంలో గోపీకృష్ణపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం ఆయనను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేసింది. అయితే మళ్లీ నల్లగొండ వెళ్లేందుకు ఏడాది కాలంగా ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు కమిషనర్ చౌహాన్ అంగీకరించలేదట.
తాజాగా కమిషనర్ బదిలీ కావడంతో చివరి క్షణాల్లో గోపీకృష్ణ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హెడ్ ఆఫీస్‌లో డీజీఎం స్థాయిలో ఉన్న కమిషనర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి చక్రం తిప్పినట్టు తెలిసింది. ‘ఒప్పందం’లో భాగంగా ఆయన ఈ బదిలీ చేయించినట్టు సివిల్ సప్లయ్ ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో బదిలీ అయి వెళ్లేముందు కమిషనర్ చౌహాన్.. గోపీకృష్ణ ఫైల్‌పై సంతకం చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా పలువురు జీఎంల బదిలీలకు సంబంధించి కూడా ఫైల్ క్లియర్ అయినట్టు సమాచారం. సోమవారం ఉదయం స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో నల్లగొండలో జాయిన్ కావడానికి ప్రయత్నించగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లయ్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ బదిలీ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది.