Mulugu | ములుగు, మార్చి 14 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ కార్యాలయం నుంచి గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయంలో ఫైళ్లను తరలించిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ములుగు పోలీస్‌స్టేషన్ పక్కన ఉన్న జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయ కాంప్లెక్స్‌లో ఉన్న పే అండ్ అకౌంట్స్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శుక్రవారం రాత్రి తన కారులో వచ్చి అటెండర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో సుమారు 30కిపైగా ఫైళ్లను ఆఫీసు బయటకు తీసుకొచ్చారు. రోడ్డుపై తెల్లటి క్లాత్‌లో కట్టి కారులో ఎక్కిస్తుండగా అటుగా వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ ఫైళ్ల తరలింపుపై ప్రశ్నించింది.
ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ సార్ ఉన్నారని, ఆయన ఆదేశాల మేరకే కారులో పెడుతున్నట్టు అటెండర్ తెలిపాడు. సదరు అధికారి వద్దకు వెళ్లి వివరణ కోరగా తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, మార్చి నెలలో ఆడిటింగ్ ఉన్నందున ఫైళ్లను ములుగులోని తన గదికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. హోలీ పండుగ సెలవు రోజున, అదీ రాత్రి వేళ ఎందుకు ఫైళ్లను తరలిస్తున్నారని అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు. సంబంధిత కార్యాలయ జిల్లా అధికారి సమక్షంలో ఫైళ్లను తరలించాల్సి ఉండగా అటెండర్ సహాయంతో తరలించడం పలు అనుమానాలకు తావిస్తున్నది.