హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 11 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది.
కొంతకాలంగా వెయిటింగ్లో ఉన్న 13 మందికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చింది. మల్టిజోన్-1లో 69 మంది తహసీల్దార్లను బదిలీ చేసింది. ఈ ఏడాది జూన్ 30 తర్వాత రిటైర్ కాబోతున్న మరో 15 మంది తహసీల్దార్లకు సూపరింటెండెంట్/డీఏవోలుగా పదోన్నతి కల్పిస్తూ బదిలీ చేసింది. మల్టి జోన్-2లో మొత్తం 43 మంది తహసీల్దార్లకు స్థాన చలనం కల్పించింది. త్వరలో రిటైర్ కాబోతున్న మరో ఐదుగురికి సూపరింటెండెంట్/డీఏవోలుగా పోస్టింగ్ ఇచ్చింది.