SI Recruitment | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో నియామకమైన 547మంది ఎస్సై శిక్షణార్థులు మరో పది రోజుల్లో తమ పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించనున్నారు. 2022 ఏప్రిల్‌లో 17,516 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వాటిల్లో 16,929 కానిస్టేబుల్, 587 ఎస్సై పోస్టులు ఉన్నాయి.
ఎస్సై పోస్టులకు విజయవంతంగా పలు దశల్లో ప్రిలిమినరీ టెస్టు, ఫిజికల్ ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి గతేడాది ఆగస్టులోనే తుది ఫలితాలు వెల్లడించి వెంటనే సెప్టెంబర్‌లో శిక్షణకు ఆహ్వానించారు. వీరికి రాష్ట్ర పోలీసు అకాడమీలో ఇండోర్, అవుట్డోర్ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. సివిల్ అభ్యర్థులకు 12నెలలు, ఏఆర్ అభ్యర్థులకు 10నెలలు, టీఎస్ఎస్పీ అభ్యర్థులకు 9నెలలు శిక్షణ ఇవ్వగా.. షెడ్యూల్ ప్రకారం అన్నీ ఈ సెప్టెంబర్‌లోనే ముగిసేలా పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ చర్యలు తీసుకున్నారు. మహిళా అభ్యర్థులకు సైతం ఇక్కడే శిక్షణ ఇచ్చారు.
వారికి ప్రత్యేకంగా హాస్టళ్లు, మెస్ వసతి కల్పించారు. మొత్తం 587 మందిని ఎంపిక చేయగా.. శిక్షణకు ముందే కొందరు అన్విల్లింగ్ అని వివిధ ఉద్యోగాలకు వెళ్లిపోగా, ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాలతో మరి కొందరు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకొందరు శిక్షణను వదిలి వెళ్లగా.. ప్రస్తుతం 547 మంది శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరిలో సివిల్ 401, ఏఆర్ 83, టీజీఎస్పీ 29, ఫింగర్ ప్రింట్ 9, ఐటీ అండ్ కమ్యూనికేషన్ 22, పీటీఓ 3 ఉన్నారు. పోలీసు అకాడమీలో నిర్వహించే పాసింగ్ అవుట్ పరేడ్‌కు సీఎం, మంత్రులు రానుండడంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీ అభిలాష బిష్త్ తెలిపారు. రెండ్రోజుల క్రితం పోలీసు అకాడమీ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.