తిరుమలగిరి (నాగారం), ఆగస్టు 16: తండ్రిపై ముగ్గురు ప్రత్యర్థుల దాడితో ఆ పసి హృదయం తల్లడిల్లింది. ‘నాన్నా నాన్నా’ అంటూ భోరున విలపించింది. అల్లారుముద్దుగా పెంచిన తండ్రిపై జరుగుతున్న దాడితో గుండెలవిసేలా ఏడ్చింది. తండ్రిని వదలకుండా కొడుతుంటే ఏడ్చీ ఏడ్చీ కుప్పకూలింది. కన్నతండ్రిపై జరుగుతున్న దురాగతాన్ని తట్టుకోలేని ఆ పసిహృదయం అక్కడే తనువు చాలించింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డీకొత్తపల్లిలో జరిగిన ఈ ఘటనతో దౌర్జన్యాలకు పాల్పడే దుండుగులకు కనువిప్పు కలగాలని సభ్య సమాజం కోరుకుంటున్నది. కొత్తపల్లికి చెందిన బైక్ మెకానిక్ కాసం సోమయ్యకు అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూతగాదాలున్నాయి. గ్రామంలో గురువారం బోనాల పండుగ జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో సోమయ్య ఇంటి ముందుకొచ్చిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడిచేయగా సోమయ్య కాలు విరిగడంతోపాటు తల పగిలింది. అడ్డుకోబోయిన భార్య తలకూ గాయాలయ్యాయి.
దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న ఆయన కూతురు పావని (14) భయాందోళనకు గురైంది. ‘నాన్నా నాన్నా’ అంటూ అరవసాగింది. అయినా ఆ కఠినాత్ములు వదలడంలేదు. తన తండ్రిని చంపుతున్నారని భావించి తట్టుకోలేని బాలిక స్పృహతప్పి కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెళ్లిచూడగా అప్పటికే తనువు చాలించింది. సోమయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా, పావని చిన్నది. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నాగారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఐ ఐలయ్య పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.