బంజారాహిల్స్, మే 8 : సంపన్నులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి దారుణ హత్యకు గురయ్యారు. ఏడాది కాలంగా ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ యువతి సహకారంతో ముగ్గురు నేపాలీ గ్యాంగ్ సభ్యులు గురువారం అర్ధరాత్రి రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో ప్రవేశించి ఆయన భార్య తనూజ (60)ను హత్యచేసి, నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్తారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని ప్లాట్ నంబర్ 46 లో నివాసం ఉంటు న్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య తనూజ, ఇద్దరు కుమార్తెలతో కలిసి మూడంతస్తుల ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 1న వైద్యం కోసం వినయ్‌రంజన్ రే బెంగళూరు వెళ్లారు. వీరి ఇంట్లో ఏడాది నుంచి కల్పన (30) అనే యువతి పనిమనిషిగా ఉంటున్నది. గతంలో పనిచేసిన కల్పన తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె స్థానంలో పనికి కుదిరి అదే ఇంట్లోని సర్వెంట్ రూమ్‌లో ఉంటున్నది. వినయ్‌రంజన్ రే బెంగళూరుకు వెళ్లడంతో పనిమనిషి కల్పనను తన గదిలో పడుకోవాలని తనూజ సూచించారు. పెద్ద కుమార్తె సునందతోపాటు మరో కుమార్తె మూడో అంతస్తులోని బెడ్రూమ్లో నిద్రిస్తుంటారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో మరమ్మతుల కోసం కార్పెంటర్ వచ్చి కుమార్తె సునందకు ఫోన్ చేశాడు. కింది అంతస్తుకు వచ్చిన సునంద.. తల్లి గదిలోకి వెళ్లి చూడగా ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు, స్థానికుల సహాయంతో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే తనూజ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
తనూజ హత్య విషయంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ బృందాలతోపాటు ఫోరెన్సిక్ విభాగం సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో కల్పన బయటకు వచ్చి ఇంటికి ఎదురుగా ఉన్న పార్కు వైపు సైగలు చేయడం.. క్షణాల్లోనే ముగ్గురు ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు కనిపించాయి. గంటన్నర తర్వాత రెండు భారీ బ్యాగులతో కల్పనతోపాటు ముగ్గురు ఆగంతకులు వచ్చిన దారిలోనే పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. రెండ్రోజులుగా ఆగంతకులు వినయ్‌రంజన్ ఇంటివద్దకు వచ్చి రెక్కీ నిర్వహించినట్టు, కల్పనతో మాట్లాడి వెళ్లినట్టు తేలింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కల్పనతోపాటు ఇంట్లోకి వెళ్లిన ఆగంతకులు నేరుగా తనూజ బెడ్రూమ్లోకి వెళ్లి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులను బంధించి ఆమె ఒంటిమీద ఆభరణాలతోపాటు అల్మారాలో ఉన్న ఆభరణాలతోపాటు నగదును సూట్‌కేసుల్లో సర్దుకొని తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చి పార్కు గుండా పారిపోయినట్టు తేలింది. నోట్లో గుడ్డలు కుక్కడంతో ఊపిరి ఆడకపోవడంతో తనూజ మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ర్టాల్లోనే అత్యంత భద్రత కలిగిన ప్రాంతమైన ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణిని దారుణంగా హత్య చేయడంతోపాటు భారీగా సొత్తును దోచుకువెళ్లిన వార్త క్షణాల్లోనే వ్యాపించడంతో డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్సహా పోలీసు యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకున్నది. నిందితులను పట్టుకొనేందుకు సుమారు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు సమీప ప్రాంతాలను తనిఖీ చేయగా నిందితులు పారిపోయిన దారిలో కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యలో పాల్గొన్న ఓ నిందితుడు వాడిన క్యాప్, మాస్క్ సమీపంలోని పార్క్‌లో పారవేయగా వాటిని క్లూస్ టీమ్ సేకరించింది. నేపాలీ గ్యాంగ్ సభ్యులు పారిపోయిన దారిలో సీసీ ఫుటేజీని సేకరిస్తున్నారు. నిందితులకు సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, త్వరలోనే వారిని పట్టుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం నేపాల్ సరిహద్దులకు వెళ్లినట్టు తెలుస్తున్నది.
జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు నెలల వ్యవధిలో నేపాలీ గ్యాంగ్‌లు మూడు దోపిడీలకు పాల్పడటం సంచలనంగా మారింది. ఫిబ్రవరి 5న రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 69లోని నందగిరిహిల్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న రవీంద్రకుమార్శర్మ అనే వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న భూపేందర్ షాహీ అనే వ్యక్తి నలుగురు నేపాలీ గ్యాంగ్ సభ్యులతో కలిసి సుమారు రూ1.3 కోట్ల విలువైన సొత్తును చోరీచేశాడు. ఆ ఘటనను మరువకముందే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో నివాసం ఉంటున్న రియల్ఎస్టేట్ వ్యాపారి పింగళి అనిరుధ్‌రెడ్డి నివాసంలో పనిమనుషులా చేరిన నేపాలీ గ్యాంగ్‌కు చెందిన మహేశ్షాహీ, అప్సర ఏప్రిల్ 13న అర్ధరాత్రి దాటిన తర్వాత మరో ముగ్గురి సహకారంతో ఇంట్లోకి ప్రవేశించి సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, ఖరీదైన వాచీలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనల తరువాత సంపన్నుల ఇండ్లలో నేపాలీ పనిమనుషుల వివరాలు సేకరించేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
తనూజ హత్య నేపాలీ గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా ఆధారాలు లభ్యమయ్యాయి. కొంతకాలంగా దేశవ్యాప్తంగా నేపాలీ గ్యాంగ్‌లు పలు నేరాలకు పాల్పడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో రెండునెలల క్రితం నేపాలీ గ్యాంగ్‌లు చోరీ చేయడంతో నిందితులను పట్టుకున్నాం. నేపాలీలను పనిమనుషులుగా పెట్టుకుంటే వారి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలని గతంలో సైతం చెప్పాం. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటాం.