హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) కొనసాగుతున్నాయి. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు, కర్మాన్‌ఘాట్ నుంచి కోఠి వరకు హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ క్రమంలో నగరంలోని 21 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. గౌలిగూడ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి 8 గంటలకు ముగుస్తుందని, ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. కాగా, హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్స్‌లు మూసిఉంటాయని చెప్పారు.
శోభాయాత్ర సాగే మార్గమిదే..
గౌలిగూడ శ్రీరామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి ఎక్స్‌రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్‌రోడ్స్, కోఠి, తిలక్‌రోడ్, సుల్తాన్‌బజార్, రాంకోఠి, కాచిగూడ ఎక్స్‌రోడ్స్, నారాయణగూడ, చిక్కడపల్లి ఎక్స్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అశోక్‌నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ వెనుక వైపు నుంచి, ప్రాగా టూల్స్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, బైబుల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూం మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయం, రామ్‌గోపాల్‌పేట్ పీఎస్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్స్, సీటీవో జంక్షన్, రాయల్ లీ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ నుంచి ఎడమ వైపు మీదుగా తాడ్బండ్లోని శ్రీహనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. 12 కిలోమీటర్లు కొనసాగే ఈ యాత్ర రాత్రి 8 గంటల వరకు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వస్తున్న మరో ర్యాలీ చంపాపేట్ ఎక్స్‌రోడ్స్, ఐఎస్ సదన్, దోబిఘాట్, మలక్‌పేట్ ఏసీపీ ఆఫీస్, సైదాబాద్ కాలనీ రోడ్డు, సరూర్‌నగర్ ట్యాంక్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, నల్లగొండ క్రాస్‌రోడ్డు, చాదర్‌ఘాట్ నుంచి కోఠి డీఎం అండ్ హెచ్ జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ ప్రధాన ర్యాలీలో కలుస్తుందన్నారు.
ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లండి..
శోభాయాత్ర వెళ్లే మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో వాహనదారులు ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూం (040-27852482), ట్రాఫిక్ హెల్ప్ లైన్(9010203 626)కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూం, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ (https://twitter.com/HYDTP, https://facebook.com/HYDTP/) ద్వారా సమాచారాన్ని తెలుపొచ్చన్నారు.