హైదరాబాద్: భారీ వర్షాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై (NH 65) రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురయింది. దీంతో సూర్యాపేట-ఖమ్మం మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా బెజవాడకు పంపిస్తున్నారు.
అదేవిధంగా విజయవాడ నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలను గుంటూరు, మిర్యాలగూడ, నార్కట్పల్లి నుంచి దారిమళ్లిస్తున్నారు. ఇక ఖమ్మంలో వరదల కారణంగా సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు. సూర్యాపేట-ఖమ్మం బైపాస్ మార్గంలో లారీలు భారీగా నిలిచిపోయాయి. కాగా, సూర్యాపేట మీదగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణ సమయంలో అత్యవసర పరిస్థితి ఎదురైతే 9010203626 అనే నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు.