Congress | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ తల్లి జన్మ దినోత్సవంగా జరిపితే తప్పేమిటని బీజేపీని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి జన్మదినాన్ని తమ ప్రభుత్వం నిర్వహిస్తామంటే బీజేపీ నాయకులకు ఉలుకు ఎందుకు? అని అన్నారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏండ్లు పోరాడిన తర్వాత తమ అధినేత్రి సోనియాగాంధీ తన జన్మదిన కానుకగా డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
యుపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పడిందని వెల్లడించారు. సోనియాగాంధీ పట్ల ఆ మాత్రం కృతజ్ఞత భావము ఉండకూడదా? అని నిలదీశారు. రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2నే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని తెలిపారు. రాష్ట్రంలో సీట్లు పెరిగాయని బీజేపీ నేతలు చంకలు గుద్దుకోవటం మాని, దేశ ప్రజలు బీజేపీకి ఎందుకు చెక్ పెట్టారో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని హితవు పలికారు.