జనగామ, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనకుండా సెటిల్మెంట్ దందాలు, భూకబ్జాలు, కుంభకోణాలు, కుట్రలు, ఓటుకు నోటు వంటి కేసుల్లో జైలుకెళ్లొచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు ఏజెంటే’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా రేవంత్, షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘తెలంగాణ ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని మీకు నా గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేకుంటే మీరు పదవులు వదిలి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ చేశారు.
రేవంత్ మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్లందరి పైనా భూకబ్జా కేసులు ఉన్నాయన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారు ప్రజల కోసం జైలుకు పోలేదని, కుంభకోణాలు, కుట్ర లు, కుతంత్రాల కేసుల్లో జైలుకు పోయారని తెలిపారు. తాను పట్టుబట్టి 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించానని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఏం చేశావో చెప్పాలని రేవంత్‌ను ప్రశ్నించారు.
‘ఒకసారి గెలిచిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయని నువ్వు, నీ కొడంగల్‌లో మళ్లీ గెలుస్తవా? మలాజిగిరిలో మళ్లీ పోటీ చేస్తవా? నీవు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమే. నీ గురించి నీ కాంగ్రెసోళ్లే మాట్లాడుతున్నరు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఓటమి లేకుండా గెలిచిన చరిత్ర నాది. నువ్వు నా గురించి మాట్లా డే వాడివయ్యావా? మా తాతలకు 1,600 ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు వంద ఎకరాలు మిగిలింది. పేదలకు ఉచితంగా ఇచ్చిన మా భూముల్లో తండాలు ఏర్పాటైన విషయం నీకు తెలుసా? నీలాగా, నీ చెంచా జంగా లాగా భూకబ్జాలు, దందాలు, మోసాలు వంటి ఒక్క చిన్న కేసు కూడా నాపై లేదు. రికార్డులు చూసుకొని మాట్లాడు’ అంటూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు.
రేవంత్ వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి..
గతంలో 15 సీట్లు గెలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు రేవంత్ వల్లే 5 సీట్లు కూడా గెలవలేని స్థితికి చేరిందని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్, షర్మిల పాదయాత్రలను నిలిపి వేస్తామని తమ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పట్టుపడితే, తానే వద్దని వారించానని, వాళ్లు చచ్చిన పాములని చెప్పి ఆపినట్టు తెలిపారు. ఒకవేళ తానే అడ్డుకోవాలనుకుంటే జనగామ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గంలో తిరిగే వారా? అని ప్రశ్నించారు. పాదయాత్రలు చేసే వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడకుండా, కనీస సంసారాన్ని పాటించాలని సూచించారు.