TS Minister Puvvada | మధిర, జూలై 17: ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏజెంట్‌గా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీనా? లేదా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీనా..? అనే అంశాన్ని తేల్చాలి’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం- మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం’పై రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సాగుపై కనీస అవగాహన లేకుండా పంటకు రోజుకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
సీఎం కేసీఆర్ 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించడంతోనే రాష్ట్రంలో సాగు పండుగైందని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యమ నేతగా కేసీఆర్ నాడు అసెంబ్లీలో ‘తెలంగాణ వస్తే పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తా’ అని ప్రకటించారని, దీనిపై నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి జానారెడ్డి ‘మీరు పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే నేను కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకొంటాను..’ అని అన్నారన్నారు.
అన్నట్లే స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి కేవలం మూడు నెలల్లోనే పంటలకు విద్యుత్ అందించడం మొదలుపెట్టారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పంటలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని బీరాలు పలికేవారని, నిజానికి ఆయన పంటలకు నాణ్యమైన విద్యుత్ అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ‘పంటలకు ఉచిత విద్యుత్’ ఇస్తామని ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లి అక్కడ ‘పంటలకు రోజుకు మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది..’ అనడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పందించాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులు కర్రు కాల్చి వాతలు పెట్టాలన్నారు.
నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘వ్యవసాయం దండగ’ అన్నారని పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తామని ప్రకటించారని, కానీ తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పింఛను ఎంత ఇస్తున్నారో వెల్లడించలేదన్నారు. ఆయన లీడర్ కాదని, రీడర్ అని మంత్రి ఎద్దెవా చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మధిర ఏఎంసీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, ఎంపీపీ పూర్ణయ్య పాల్గొన్నారు.