హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడని.. ఆయన ప్రభావం తెలంగాణలో ఉండదని టీపీపీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రజలను, ఇక్కడి సంస్కృతిని ఉద్దేశించి పవన్‌కల్యాణ్ నీచంగా మాట్లాడారని ఆయన గుర్తుచేశారు.
మంగళవారం గాంధీభవన్‌లో మహేశ్‌కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వ్యక్తి.. తెలంగాణ వ్యతిరేకి అని, ఆయన చెబితే ఇక్కడ ఓట్లు వేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక భయపడిన బీజేపీ.. ఉనికి కోసమే పవన్‌కల్యాణ్ శరణు కోరారని మహేశ్‌గౌడ్ విమర్శించారు.