హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను సైతం రాజకీయ వేదికలుగా మార్చుతున్నది. ఆలయ కమిటీల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను సభ్యులుగా నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నది. దేవాలయ కమిటీలు, ట్రస్ట్ బోర్డులలో సోషల్ మీడియా కోఆర్డినేటర్లను సభ్యులుగా నియమించాలని కోరుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లేఖ రాశారు. వీరిని కమిటీల్లో నియమించడం ద్వారా సోషల్ మీడియా వేదికగా ఆలయాల్లో నిర్వహించే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తారని సూచించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఇటీవల నిర్వహించిన సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రస్తుత చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. టీపీసీసీ చీఫ్ సిఫారసును మంత్రి కొండా సురేఖ అంగీకరించినట్టుగా తెలిసింది. కొత్తగా నియమించే ఆలయాల కమిటీల్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లను నియమిస్తామని చెప్పినట్టుగా తెలిసింది.