మణికొండ, సెప్టెంబర్ 9: రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తికి చెందిన స్థలం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం రూ.10లక్షలు డిమాండ్ చేసిన ఆమె.. మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిరేవుల గ్రామ పరిధిలోని ఓ స్థలం విషయంలో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేయాలంటూ వినోద్‌కుమార్ వారం క్రితం.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణిహారికను విన్నవించాడు. అందుకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని మణిహారిక తెలిపారు. అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేనని వినోద్‌కుమార్ చెప్పడంతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.4లక్షల నగదుతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన వినోద్.. టౌన్‌ప్లానింగ్ మణిహారికకు అందజేశాడు. ఆ నగదును టేబుల్ డ్రాలో పెట్టుకున్న మణిహారిక.. ఫైల్‌ను తీసి క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్, ఇతర అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని, కానీ ఫైల్ క్లియరెన్స్ కోసం మణిహారిక డబ్బుల ఇవ్వాలంటూ వేధించారని, అందుకే ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.