హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ)లో మూలకుపడిన బస్సులను కిరాయికి నడపాలని కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. టూరిజం ప్యాకేజీలతోపాటు కిరాయి ప్రాతిపదికన ఈ 30 బస్సులను తిప్పాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. 2015లో టీటీడీతో కుదుర్చుకున్న టెంపుల్ టూరిజం ప్యాకే జీ ఒప్పందాన్ని నిరుడు డిసెంబర్ 1న రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో టీజీటీడీసీకి అప్పటివరకు వస్తున్న అతి పెద్ద ఆదాయ వనరుకు గండిపడినట్టయింది. బస్సులకు గిరాకీ, డ్రైవర్లకు ఉపాధి కరువైంది. సిబ్బందికి పనిలేకుండాపోయింది.
ఏపీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో కేవలం ఆరు నెలల్లోనే రూ.12.28 కోట్ల వరకు ఆదాయం తగ్గిందని టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టంచేశారు. తగ్గిన ఆదాయాన్ని రాబట్టుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా స్టార్ హోటళ్లపై ఆ కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అనేక స్టార్ హోటళ్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒప్పంద విషయాలపై చర్చిస్తున్నారు. ప్యాకేజీ అంశాలను వెల్లడిస్తున్నారు. ఒకవేళ స్టార్ హోటళ్లతో ఒప్పం దం కుదరకపోతే తెలుగు రాష్ర్టాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలకు టూరిజం ప్యాకేజీతో టూరిస్టు బస్సులను నడపాలని కార్పొరేషన్ అధికారులు యోచిస్తున్నారు.