హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ-టీజీటీడీసీ అధికారుల అలసత్వంతో సంస్థ నెలకు సుమారు రూ.కోటి నష్టపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ సర్కారు నిరుడు డిసెంబర్లో రద్దు చేసుకోవడమే ఇందుకు కారణం. దీంతో ఎనిమిది నెలలుగా టీజీటీడీసీ బస్సులు మూలనపడ్డాయి. కానీ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ 2015లో టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం టీజీటీడీసీ వద్దనే తిరుమలకు రాకపోకలు, దర్శనం, వసతికి సంబంధించిన టికెట్ కొనుగోలు చేస్తే సరిపోయేది. టికెట్ ద్వారా వచ్చిన సొమ్ములో కొంత ఒప్పందం ప్రకారం టీజీటీడీసీ… టీటీడీకి చెల్లించేంది. ఒకటి రూ.3,800 ప్యాకేజీ, రెండోది రూ.4,400 ప్యాకేజీ. ఇవి చాలా సౌకర్యంగా ఉండేవని భక్తులు కూడా హర్షం వ్యక్తంచేశారు. బస్, దర్శనం టికెట్ల బుకింగ్, వసతి కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా సులభంగా ఉండేదని భావించారు. కానీ ఏపీలో చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత ఈ ప్యాకేజీని టీటీడీ రద్దు చేసింది. దీంతో టీజీటీడీసీకి చెందిన 30 బస్సులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. భక్తులు ఇబ్బందులకు మంచి ప్యాకేజీ లేకుండాపోయింది. టీజీటీడీసీకి నెలనెలా వచ్చిన రూ.కోటి ఆదాయం కూడా రాకుండాపోయింది. ఇప్పటివరకు సుమారు రూ.8కోట్లు నష్టం జరిగింది. తెలంగాణ సర్కారు, ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి, ప్యాకేజీని పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.