హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 22న అమరజ్యోతి ఆవిష్కరణతోపాటు అమరవీరుల సంస్మరణ ర్యాలీ ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్లపై సాంస్కృతికశాఖతోపాటు ఇతర అధికారులతో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంబేదర్ 125 అడుగుల విగ్ర హం నుంచి సచివాలయం ఎదుట ఉన్న అమరజ్యోతి వేదిక వరకు 5 వేల మందికిపైగా కళాకారులతో ర్యాలీని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కళాకారులు శకటాలపై తమ కళాప్రదర్శనలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న తాగునీటి పండుగ, హరిత దినోత్సవం, విద్యా దినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లు, అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం ఆమె టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 నియోజకవర్గాల్లో జలమండలి ఆధ్వర్యంలో తాగునీటి పండుగ నిర్వహించనున్నట్టు హైదరాబాద్ వాటర్ వర్స్ ఎండీ దానకిశోర్ తెలిపారు. సోమవారం నిర్వహించే హరిత దినోత్సవ కార్యక్రమ వివరాలను పీసీసీఎఫ్ ఆర్ ఎం డోబ్రియాల్ కలెక్టర్లకు వివరించారు. ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా దేవాలయాల్లో దీపాలంకరణ, తెలంగాణప్రజల సంక్షేమానికి ప్రత్యేక పూజలు, చండీహోమాలు జరుపనున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. చర్చిలు, మసీదుల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేపడతామని పేర్కొన్నారు.