హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఏపీఎస్ఆర్టీసీని ఆ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం ప్రక్రియపై టీఎస్ఆర్టీసీ అధికారుల అధ్యయనం ముగిసింది. అక్కడ ఉద్యోగుల కేటాయింపు మార్గదర్శకాల రూపకల్పనపై స్టడీ చేసేందుకు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ఏపీలో రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో విజయవాడలో భేటీ అయ్యారు. 2020 జనవరి 1నే ఏపీఎస్ఆర్టీసీ అక్కడి ప్రభుత్వంలో విలీనమైంది. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు విలీన ప్రక్రియ గురించి టీఎస్ఆర్టీసీ అధికారులకు వివరించారు. ఈ పర్యటనలో టీఎస్ఆర్టీసీ ఈడీలు కృష్ణకాంత్ (పరిపాలన), మునిశేఖర్ ఆపరేషన్స్), చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ పుష్పకుమారి పాల్గొన్నారు.
పెరగనున్న వేతనాలు
ప్రభుత్వంలో విలీనంతో వేతనాలపై ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. డ్రైవర్లు, కండక్టర్లు వంటి ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని, అధికారులు, ఉన్నతాధికారులకు పెరగవని భావిస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత సాంకేతికంగా అధికారులు, ఉన్నతాధికారుల వేతనాలు తగ్గుతాయి. జీతాలు తగ్గించకుండా ప్రస్తుతం వస్తున్న దానిని కొనసాగించి భవిష్యత్తులో పెరిగే మొత్తాన్ని సర్దుబాటు చేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఏపీలో విలీనం తర్వాత డ్రైవర్ల వేతనం బేసిక్ రూ. 27,500, కండక్టర్లకు రూ.25,220, అటెండర్లకు రూ.20,000 గా ఉన్నది. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది రిటైర్మెంట్ వయస్సు 60 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెరుగనున్నది.
టీఎంయూ నేతలకు ఘన సన్మానం
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరిందని, ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినదని తెలంగాణ మజ్దూరు యూనియన్ (టీఎంయూ) రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మారవరం థామస్‌రెడ్డి పేర్కొన్నారు. వీరు గురువారం ఏపీ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులతో విలీన ప్రక్రియపై చర్చించనున్నారు.అధ్యయనం అనంతరం విలీన ప్రక్రియపై నివేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శకాల కమిటీకి అందజేస్తామని థామస్‌రెడ్డి తెలిపారు.