హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : విదేశీ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ)లో టామ్‌కామ్ సహా పలు కంపెనీల ప్రతినిధులు, ఏజెంట్లతో విదేశీ ఉద్యోగాల కల్పనపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, పోర్చుగల్, జర్మనీ, రుమేనియా, కెనడా, జపాన్ దేశాల్లో ఉన్న ఉద్యోగావకాశాల కోసం అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు అటువైపు దృష్టి సారించాలని సూచించారు.
విదేశాలకు వెళ్లాలనుకొనేవారు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లోని టామ్‌కామ్ సెంటర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. టామ్‌కామ్ సేవలు కార్మిక రంగాల్లోనూ విస్తరించాలని చెప్పారు. మంత్రి ఆదేశం మేరకు కొత్తగా జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, రాజన్న సిరిసిల్లలో టామ్‌కామ్ సెంటర్లను ప్రారంభిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. టామ్‌కామ్ స్పెషల్ సెక్రటరీ, సీఈవో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విదేశీ ఉద్యోగాల సమాచారం ‘TOMCOM mobile app’, వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే జపాన్ వెళ్లేందుకు మొదటి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభించామని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 మంది నర్సులు జపాన్‌లో ఉద్యోగాలు పొందుతారని వివరించారు. కార్యక్రమంలో రీజినల్ పాసుపోర్టు అధికారి దాసరి బాలయ్య, అమిత్ కుమార్, భిక్షపతి, డీఎస్ రెడ్డి, ఆర్ఎఎస్ అసోసియేషన్ ప్రముఖులు, ఏజెంట్లు, అధికారులు పాల్గొన్నారు.