Tomato Price | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకు ఆకాశంలో ఉన్న టమాట ధర.. నేడు అమాంతం పడిపోయింది. మూడు నెలల క్రితం కిలో రూ.300 పలికి బెంబేలెత్తించగా, నేడు 30 పైసలకూ కొనే దిక్కులేక నేలపాలవుతున్నది. 20 రోజుల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో గురువారం టమాట ధర పూర్తిగా పతనమైంది.
25 కేజీల బాక్స్ రూ.10 నుంచి రూ.35 వరకు పలికింది. అంటే కేజీ ధర దాదాపు 30 నుంచి 40 పైసలు అన్నమాట. రైతుకు కనీసం రవాణా చార్జీలు రాని పరిస్థితి నెలకొంది. నెల క్రితం మార్కెట్కు టమాటలు తీసుకొచ్చి నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే టమాట మూడు నెలల క్రితం ఊహకందని ధరలతో కొందరు రైతులను కోటీశ్వరులను చేయగా, ఇప్పుడు అదే టమాట రైతుకు కంటతడి పెట్టిస్తున్నది.