TGS RTC | హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నేడు ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు, ఉద్యోగులకు అపాయింటెడ్ తేదీని ప్రకటించి, ప్రభుత్వం నుంచి వేతనాల చెల్లింపు, కార్మిక సంఘాలకు ఎన్నికల వంటి హామీలను విస్మరించడంపై ఆర్టీసీ కార్మిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయా అంశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంపై కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి బడ్జెట్ ప్రతిపాదనల్లో కేవలం రూ.4,084.43 కోట్లనే ప్రకటించారు. ఈ మొత్తాన్ని మహాలక్ష్మి పథకానికి కేటాయిస్తున్నట్లు చూపారు. బస్సుల్లో రద్దీ పెరగడంతో కొత్త బస్సులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వం వీటి కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. రాయితీ బస్‌పాస్‌లకు సంబంధించి రూ.950 కోట్లు, ఇతర అవసరాలకు కావాల్సిన వాటితో కలుపుకొని రూ.1,782 కోట్లపై స్పష్టత లేకపోవడమూ ఆందోళన కలిగిస్తున్నదని ఆర్టీసీ బోర్డు మాజీ సభ్యులు కొందరు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. ఈ విషయమై ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నది. ఆయా డిమాండ్ల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాయనే కారణంతోనే కార్మిక సంఘాల ఎన్నికలను సైతం నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని కార్మికవర్గాలు పేర్కొంటున్నాయి.