హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): వివాహ బంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విద్యా, ఉద్యోగం, అనారోగ్యం ఇతరత్రా కారణాల వల్ల మానసిక సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. మానసికంగా దృఢంగా లేకపోవడం, ధైర్యం చెప్పేవారు ముందుకురాకపోవడంతో ఒత్తిడితో తీవ్రంగా సతమతమవుతున్నారు. ఫలితంగా కొందరు దవాఖానల్లో చేరుతుండగా, మరికొందరు దీర్ఘకాలంగా మందులు వాడుతున్నారు.
కొవిడ్-19 మహమ్మారి చాలామందిలో మానసికశక్తిని దెబ్బతీసింది. స్వల్ప లేదా దీర్ఘకాలిక ఒత్తిళ్లకు ఆజ్యం పోయగా గతంతో పోల్చితే మానసిక ఒత్తిడి, నిసృ్పహలకు లోనవుతున్నవారి సంఖ్య 25 శాతం పెరిగిందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మహిళలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని ఇటీవల పలు పరిశోధనల్లో తేలింది. పురుషులకు శారీరక రుగ్మతల సగటుస్థాయి ఎకువగా ఉన్నా, మానసిక అనారోగ్య సమస్యలు మహిళల్లోనే అధికంగా నమోదవుతున్నట్టు అందులో వివరించారు. నేడు (సోమవారం) ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
మహిళల్లోనే 53 శాతం ఎక్కువ
పురుషుల(29.3%)తో పోలిస్తే మహిళలు (41.9%) న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్స్, డిప్రెసివ్ డిజార్డర్స్ బారిన పడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్న స్త్రీల శాతం పురుషుల శాతం కంటే దాదాపు 53శాతం ఎకువని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది అతివలు మానసిక సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
భారత్లో ఏడాదికి దాదాపు 2.5లక్షలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా చాలావరకు అధికారిక లెకల్లో చేర్చడం లేదని లాన్సెట్ పత్రిక గతంలో వెల్లడించింది. మానసిక, ఆరోగ్య, ఇతర కారణాలతో 2021లో దేశవ్యాప్తంగా 45 వేల మందికి పైగా మహిళలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేర గణాంక సంస్థ తెలిపింది. మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు భావిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, కుటుంబసభ్యులు కూడా మద్దతుగా నిలబడటం వల్ల ఒత్తిడిని తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మహిళల ప్రధాన మానసిక సమస్యలు
శారీరక, మానసిక వేధింపులు, పెరినాటల్ డిప్రెషన్, కుటుంబసభ్యుల మద్దతు లేకపోవడం, పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం, పనిఒత్తిడి, శారీరక బలహీనత, అలసట, ఏకాగ్రత, అసమర్థత, నిద్రలేమి, ఒంటరితనం, ఇతర అనారోగ్య సమస్యలు.
మానసిక అనారోగ్య లక్షణాలు
తీవ్ర విచారం, తరచూ ఏడవడం, అయిష్టంగా పనులు చేయడం, జ్ఞాపకశక్తి-ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి లేదా ఎక్కువ నిద్రపోవడం, ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం, ఆత్మహత్య ఆలోచనలు, నిరంతర తలనొప్పి, విపరీతమైన చిరాకు.
మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
భార్యాభర్తలు తరచూ మాట్లాడుకోవాలి. చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పాలి. దాపరికం ఉండకూడదు. బాల్యంలో ఎకువ బాధాకరమైన అనుభవాలు, సెక్స్ ఒత్తిడి, నిరాశ మహిళల్లో ఆందోళనను పెంచుతుంది. పనిఒత్తిడి, విపరీత ఆలోచనలు కూడా మహిళలను కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. కుటుంబసభ్యులు మహిళల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి.
-పద్మజ, సైకో థెరపిస్ట్