హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అవకాశం కల్పించింది. ఈ మేరకు డిసెంబర్ 1,2 తేదీల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకోవచ్చని ఎన్టీఏ బుధవారం ఒక ప్రకటనలో సూచించింది. పేరు, తల్లిదండ్రుల పేర్లు, 10, 12వ తరగతుల వివరాలు, ఎగ్జామినేషన్ సిటీ, మీడియం, పుట్టిన తేదీ, జెండర్, క్యాటగిరీ, సబ్ క్యాటగిరీ, ఆధార్‌కార్డు తదితర వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని వెల్లడించింది. మొబైల్ నంబర్, ఈమెయిల్, అడ్రస్, అత్యవసర కాంటాక్ట్ నంబర్, ఫొటో వంటి వివరాలను మార్చుకోవడానికి వీల్లేదని తెలిపింది. ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులోకి ఉంటుందని వివరించింది. కాగా, జేఈఈ మెయిన్-1 ఆన్లైన్ దరఖాస్తుల గడువు గురువారంతో ముగియనున్నది. ఇప్పటివరకు 13లక్షల మంది జేఈఈ మెయిన్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తులు సమర్పించారు.
మెరిట్ అభ్యర్థులకు ప్లేస్‌మెంట్స్ కల్పించాలి : బుర్రా వెంకటేశం
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు పొందని, మెరిట్ అభ్యర్థులకు పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లల్లో ప్లేస్‌మెంట్స్ కల్పించేందుకు చొరవ తీసుకోవాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సూచించారు. యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నియామక పరీక్షల్లో మెరిట్లో ఉండి, ఉద్యోగాలు పొందలేని వారి వివరాలతో కూడా డేటాబేస్‌ను ప్రభుత్వరంగ, ప్రైవేట్‌రంగ సంస్థలకు అందించడం ద్వారా మెరుగైన ప్లేస్‌మెంట్స్ కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న యూపీఎస్సీ శతాబ్ది సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనేకమంది అతి తక్కువ మార్కుల తేడాతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని, ఇలాంటి వారికి ఈ విధానం ద్వారా మంచి ప్లేస్‌మెంట్స్ కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. త్వరలోనే జరగబోయే జాతీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమావేశానికి పలువురిని ఆహ్వానించారు.