Telangana | జగిత్యాల, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): అరవై ఏండ్ల ఉమ్మడి ప్రయాణంలో తేటతేట తెనుగు అయిన తెలంగాణ తెలుగుకు గుర్తింపే రాలేదు. తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు ద్వితీయ శ్రేణివారీగా ఈసడించబడ్డారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీశ్రీ, గురజాడ అంటూ అంతా వారే రాజ్యమేలారు. కన్నడాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఉమ్మడి పాలకులకు కనిపించాడు తప్ప, మల్కాభిరాముడు అని పేరున్న మన కుతుబ్షాహీ ప్రభువు గుర్తుకు రాలేదు. సంస్కృతంతో నిండిన భారతమే తప్ప, స్వచ్ఛ తెలుగులో రాసిన పాల్కూరి సోమనాథుడు కనిపించలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే తెలంగాణ భాషను కాపాడుకునే ప్రయత్నం ఆరంభమైంది. ‘అన్యభాషలు నేర్చి ఆంధ్రంభు రాదంటూ సకలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అంటూ పౌరుషంగా ప్రకటించిన కాళోజీ నారాయణరావు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించారు. నేడు తెలుగు భాషా దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ తెలుగు భాష ప్రాచీనత, చరిత్ర వికాసంపై ప్రత్యేక కథనం..
ఐదువేల ఏళ్ల వారసత్వం
హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచి, జర్మనీ తదితర భాషలన్నీ సంస్కృతం నుంచి ఆవిర్భవించ గా, తెలుగు మాత్రం ద్రావిడ భాష నుంచి ఉద్భవించింది. మధ్య ఆసియాప్రాంతంలో ఐదు వేల ఏండ్ల క్రితం సుమేరియన్ల రాజధాని నినివే వద్ద జరిగిన తవ్వకాల్లో బయల్పడిన 25 వేల మట్టిప్రతుల్లో తెలుగు అక్షరాలు, పదాలు కనిపించాయి.
200 ఏళ్లకు ముందే తెలంగాణలో అభివృద్ధి
తెలుగు అక్షరాలకు నుడికారం దిద్దారని నన్నయ్య బట్టారకుడు, నారాయణ భట్టులను చెప్పుకుంటున్నా వాస్తవానికి వారి కంటే 200 ఏండ్ల ముందే తెలుగు భాష తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందింది. మౌర్యుల తొలి చక్రవర్తి చంద్రగుప్తడు కాలంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ రచించిన ఇండికాలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రులు అనే బలమైన రాజ్యం ఉందని పేర్కొన్నారు. గోదావరి ఒడ్డున రాజధాని ప్రాంతం కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల గ్రామమని చరిత్రకారులు గుర్తించారు. కోటి లింగాల వద్ద బయల్పడిన శాతవాహనుడు, సీముకుడి నాణాలపై తెలుగు భాషకు మూలమైన బ్రహ్మీ లిపిలో అక్షరాలు లిఖించబడ్డాయి. క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన నాణెంలు లభించగా, వాటిపై పేర్లు ప్రాకృత తెలుగులోనే ముద్రించబడి ఉన్నాయి. ధూళికట్ట వద్ద లభించిన శాసనం సైతం తెలుగు భాషా ప్రాచీనతను చాటుతుంది. కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్ట వద్ద క్రీ.శ 945లో కవి జీనవల్లభుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో శాసనాలను వేయించగా, అందులో మూడు తెలుగు కంద పద్యాలు ఉండడం విశేషం. తెలుగు వ్యాకరణంలోని కంద పద్ధతికి కరీంనగర్ ప్రాంతమే పుట్టినిల్లు అని స్పష్టమైంది. కాకతీయుల కాలానికి చెందిన పాల్కూరి సోమనాథుడు పండితారాధ్య చరిత, బసవ పురాణాలను ద్విపద కావ్యాలుగా మలిచాడు. కుతుబ్షాహీల పాలనలో రుద్రకవి, జగన్నాథుడు, అక్కన్న, మాదన్నలు తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేశారు.
20వ శతాబ్దంలో కొత్తపుంతలు
20వ శతాబ్దంలో తెలంగాణలో తెలుగు సాహిత్యం, భాష కొత్త పుంతలు తొక్కింది. నిజాం పాలనలో తెలుగుకు గొప్ప ప్రాభవమే కనిపించింది. నిజాంకు ఎదురుతిరిగి వట్టికోట అళ్వారుస్వామి జైలులోనే ‘జైలు లోపల’ అనే సంపుటిని వెలువరించాడు. ప్రజల మనిషి, గంగు నవలలను వ్యవహారిక భాషలో రాశాడు. దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార, రుద్రవీణ, మార్పు నాతీర్పు, ధ్వజమెత్తిన ప్రజా, తిమిరంతో సమరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. రంగాచారి రాసిన చిల్లరదేవుళ్లు, జీవనయానం, మోదుగుపూలు సైతం తెలుగు సాహిత్యంలో ధ్రువతారలే. కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ ప్రజల తిరుగుబాటుకు ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఆచార్య సింగిరెడ్డి నారాయణరెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ తదితరులు తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడేందుకు కృషి చేశారు.
ప్రాచీన హోదాకు తెలంగాణే అర్హత
రెండువేల ఏండ్ల చరిత్ర కలిగిన భాషలకు కేంద్రం ప్రాచీన భాష హోదాను కట్టబెట్టింది. తెలంగాణ ప్రాంతంలో లభించిన ఆనవాళ్ల తో తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తెలుగు భాష ప్రాచీన హోదాను, దాని వల్ల లభించే నిధులను అనుభవిస్తున్నారు. ఆ ప్రయోజనాలను తెలంగాణకు మాత్రమే వర్తింపజేయాలని తెలంగాణ కవులు, కళాకారులు పేర్కొంటున్నారు.