Telangana decade celebrations | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు సురక్షా దినోత్సవాన్ని నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. పోలీసుశాఖలో జరిగిన సంసరణలు, వాటి విశిష్టతను సభల ద్వారా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. పోలీస్ బ్యాండ్లతో ప్రదర్శన, పోలీస్ జాగృతి కళాకారుల బృందాల ప్రదర్శనలు, బాడీ కెమెరాలు, బ్రీత్ అనలైజర్లు మొదలైన పరికరాల గురించి వివరిస్తారు. పెట్రోలింగ్ కార్స్, బ్లూ క్లోట్స్, ఫైర్ వెహికిల్స్‌తో ర్యాలీ నిర్వహిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం పెట్రోలింగ్ కార్లు, బ్లూకోట్స్ వాహనాలు, అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఆయా జిల్లా, మండల పోలీస్ స్టేషన్లలో పోలీసుల ఆయుధాలను చూసేందుకు పౌరులకు అవకాశం కల్పిస్తారు. బడాఖానాలో హోంగార్డులు, కానిస్టేబుళ్ల నుంచి ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు.