నయీంనగర్, నవంబర్15 : అన్నిరకాల వాహనాలు ఒకే వేదిక మీదికి తేవడం మహా అద్భుతమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు. శనివారం ఆయన హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షోను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. 1966-67లో తమ ఊరికి ఒక సైకిల్ రాగా దాని వెనకాలే ఉరుకుతుంటే ఒక అనుభూతిలా అనిపించేదని గుర్తుచేశారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే వార్తలు రాస్తూ ప్రజల సమస్యల తెలియజేయడమే కాకుండా, ప్రజలకు అవసరమయ్యే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.
మనుషులకు కనీస, లగ్జరీ, విలాసవంతమైన అవసరాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయన్నారు. ఒకప్పుడు లగ్జరీగా ఉన్న కారు నేడు నిత్యావసర వస్తువుగా మారిందని తెలిపారు. నాణ్యమైన వాహనాలు తక్కువ ధరలో ఒకే వేదిక మీదికి తీసుకురావడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఒకప్పుడు చంద్ర మండలానికి పోవడమే వార్త అయితే, నేడు అదే చంద్ర మండలంపై మనిషి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. సమాజంలో మార్పులకు అనుగుణంగా ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ఈ షోలు ఎంతో దోహదపడుతాయని తెలిపారు.
రానున్న రోజుల్లో వరంగల్‌లో ఎయిర్కార్ల ఎగ్జిబిషన్లు నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే ఆధ్వర్యంలోనే జరగాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆటో షోకు విశేష స్పందన లభించింది. 20 కిపైగా స్టాళ్లు, రకరకాల వాహన మోడళ్లు.. ప్రతినిధుల డెమోలు.. వినియోగదారుల ప్రశ్నలు.. కొనుగోళ్ల హడావుడి వెరసి హయగ్రీవాచారి మైదానం కిటకిటలాడింది. ఆధునిక టెక్నాలజీతోపాటు సరికొత్త ఫ్యూచర్లతో బీఎండబ్ల్యూ బైక్‌లు ఆకట్టుకున్నాయి. ఈ బైక్ ధర రూ.31లక్షలు కావడం విశేషం. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే అడ్వైర్టెజ్‌మెంట్ జనరల్ మేనేజర్ ఎన్ సురేందర్‌రావు, బ్రాంచి మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, ఎడిషన్ ఇన్చార్జి నల్లపురి విద్యాసాగర్, బ్యూరో ఇన్చార్జిలు పిన్నింటి గోపాల్‌రావు, నూర శ్రీనివాస్, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.