Bio diversity | భూగోళంపై ఉన్న సకల జీవరాశుల మనుగడకు నీరే ప్రాణాధారం. నీటి వనరుల వృద్ధితోనే జీవవైవిధ్యం పరిఢవిల్లుతున్నది. అందుకే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తెలంగాణలో నీటి వనరుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పలు చర్యలు చేపడుతున్నది. ఇవి బహుముఖ ప్రయోజనాలను అందించడంతోపాటు రాష్ట్రంలో జీవవైవిధ్యం పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు ఇప్పటికే రికార్డుస్థాయిలో పెరగడంతోపాటు మత్స్యసంపద, ఇతర జంతుజాలం ఎంతో అభివృద్ధి చెందింది.
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు గోదావరి బేసిన్‌లోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టుకు వలసవస్తుండటం.. పోచారం అభయారణ్యంలో కృష్ణజింకలు ఎన్నో ఏండ్ల తర్వాత దర్శనమిస్తుండటం, భూపాలపల్లి ప్రాంతంలో దాదాపు 17 ఏండ్ల తర్వాత పెద్దపిల్లులు మళ్లీ సందడి చేస్తుండటం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల అన్ని జిల్లాల్లో పర్యావరణ సమతుల్యత నెలకొంటుండటంతో పలు రకాల విదేశీ పక్షులు సైతం తెలంగాణకు వచ్చి తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జీవవైవిధ్య ఆవశ్యకతపై అందరిలో అవగాహన పెంచేందుకు మే 22వ తేదీని ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే (అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం)గా ప్రకటించిన ఐక్యరాజ్య సమితి.. 2013లో ఈ కార్యక్రమాన్ని ‘వాటర్ ఫర్ బయో డైవర్సిటీ’ అనే థీమ్‌తో నిర్వహించడం విశేషం.
హరితహారం విజయవంతంలో ప్రధాన భూమిక
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లెప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల పెంపు కార్యక్రమాల విజయవంతానికి నీటి వనరుల అభివృద్ధే ప్రధాన కారణం. ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రం ఎన్నో జీవజాతులకు సహజసిద్ధ ఆవాసంగా మారిపోయింది. భూసారాన్ని పెంచేందుకు అవసరమైన నత్రజని లభ్యత భారీగా పెరిగింది. దట్టంగా పెరిగిన మొక్కలు భూమి కోతను నిరోధించడంతోపాటు వర్షపు నీటి ప్రవాహాలను అడ్డుకొని భూమిలో ఇంకిపోయేలా చేస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి.