Brain tumor | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్ ట్యూమర్….అదో కనిపించని టెర్రర్. ప్రాణం పోయేవరకు తెలియదు అది రోగి మెదడులో దాగివుందని. మెదడులో అసహజ కణాల వల్ల ఏర్పడే ఈ ట్యూమర్లు రెండు రకాలు. ఒకటి క్యాన్సర్ ట్యూమర్లు కాగా, రెండవది సాధారణ ట్యూమర్లు. ఇవి చాపకింద నీరులా వ్యాపించి రోగి ప్రాణాలు తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్లపై ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సకాలంలో చికిత్స తీసుకోలేక చివరి సమయంలో దవాఖానలకు పరుగులు పెడుతున్నట్టు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లపై అవగాహన కల్పించే క్రమంలో ప్రతి ఏడాది జూన్ 8న బ్రెయిన్ట్యూమర్ నివారణ దినంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తున్నది. ఈ క్రమంలో బ్రెయిన్ట్యూమర్పై ‘నమస్తే తెలంగాణ’తో ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన, రిసర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జయలత మాట్లాడారు.
నాన్ క్యాన్సర్ ట్యూమర్స్
సాధారణంగా ట్యూమర్స్ రెండు రకాలు. అందులో బినైల్ ట్యూమర్స్, రెండవది మాలిగ్నివ్ ట్యూమర్స్. బినైల్ ట్యూమర్స్ను నాన్ క్యాన్సర్ ట్యూమర్స్గా పరిగణిస్తారు. అయితే ఈ ట్యూమర్స్ వల్ల రోగికి ప్రాణనష్టం చాలా తక్కువని, ఇది మందులతో నయమవుతుందని జయలత చెప్పారు. సాధారణంగా ఈ ట్యూమర్స్కు ప్రత్యేకంగా ‘సైబర్నైఫ్’ అనే చికిత్స చేస్తారని, ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు.
మాలిగ్నివ్ ట్యూమర్
మాలిగ్నివ్ ట్యూమర్స్ను క్యాన్సర్ ట్యూమర్స్ అంటారు. ఇవి ప్రమాదకరమని, వీటితో రోగికి ప్రాణనష్టం జరుగుతుందని డాక్టర్ జయలత తెలిపా రు. ఇవి మందులకు తలొగ్గవని, కొన్నిసార్లు మం దులే పనిచేయవని పేర్కొన్నారు. ఈ రకం ట్యూమర్స్కు శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీ ద్వారా చికిత్స అందించాలని జయలత వెల్లడించారు.
రేడియేషన్తో..
పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే మనిషి పతనానికి కారణమవుతున్నది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్ఫోన్ మనిషి శరీరంలో ఒక అవయవంగా మారింది. సెల్పోన్ వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉన్నదని జయలత తెలిపారు. సాధారణంగా 60 ఏండ్లు, ఆ పై వయస్సువారిలో బ్రెయిన్ట్యూమర్ వ్యాధులు కనిపించేవి. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవన విధానం, ఆహారపు ఆలవాట్లు, రేడియేషన్ అని చెప్పవచ్చని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమమని డాక్టర్ జయలత సూచించారు.