హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం మరో అద్భుత పథకానికి కేంద్ర బిందువు కానున్నది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా) దేశవ్యాప్తంగా శనగ పప్పు పంపిణీ చేయనున్నది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘భారత్ దాల్’ పేరుతో రాయితీపై అందజేయనున్నది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శనగపప్పు ధర రూ.90 ఉండగా, హాకా రాయితీపై రూ.60కే అందించనున్నది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హెచ్ఐసీసీలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌సింగ్ కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో పంపిణీ చేపట్టనున్నారు. తొలి దశలో 35 వేల టన్నుల శనగపప్పును పంపిణీ చేయనున్నారు.
18 రాష్ర్టాలు.. 180 పట్టణాలు
దేశవ్యాప్తంగా 18 రాష్ర్టాల్లో, ఒక్కో రాష్ట్రంలో 10 పట్టణాల్లో తెలంగాణ పప్పు అందుబాటులో ఉంచాలని కార్యాచరణ రూపొందించింది. ఆయా రా ష్ర్టాల్లో పంపిణీకి వీలుగా డిస్టిబ్యూటర్లను నియమించింది. మెట్రో నగరాలైన ముంబై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా ప్రతి నగరంలోనూ 200 చొప్పున ఆటోలను ఏర్పాటుచేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది. డీ-మార్ట్ వంటి ప్ర ధాన మార్టులపాటు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ జొమాటో, స్విగ్గి సహా చిన్న పెద్ద స్టోర్స్‌లో అందుబాటులో ఉంచనున్నా రు. హాస్పిటల్స్, జైళ్లు, క్యాంటీన్లు, దేవాలయాలకు కూడా సరఫరా చేయనున్నా రు. వీరికి 30 కేజీల బ్యాగ్‌ను కిలో రూ. 55 చొప్పున అందించనున్నారు. మూ డు నెలల క్రితం హాకా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మచ్చా శ్రీనివాసరావు.. హాకాకు జాతీయ స్థాయిలో వ్యాపారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా శనగపప్పు పంపిణీని ప్రారంభించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హాకా చైర్మన్ మచ్చా శ్రీనివాసరావు ప్రజలను కోరారు.