హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్జీహెచ్) ఇచ్చే రుణ విధానం, అనుసరిస్తున్న ప్రక్రియ బాగున్నదని తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ (టీఎన్సీడీడబ్ల్యూ) అధికారులు ప్రశంసించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు అందించే రుణాలు, బ్యాంకుల సహకారం, మహిళా సంఘాల అనుభవాలపై అధ్యయనం చేసేందుకు తమిళనాడుకు చెందిన ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించింది. తొలిరోజు సెర్ప్ కార్యాలయంలో సీఈవో గౌతమ్ పోట్రు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామంలో పర్యటించి అక్కడి ఎస్‌హెచ్‌జీ సభ్యులు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, క్షేత్రస్థాయి సెర్ప్ సిబ్బందితో భేటీ అయ్యారు. రుణాలు పొంది మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిశీలించారు. కవాడపల్లి సర్పంచ్ కూడా మహిళా సంఘ సభ్యురాలు కావడంతో తమిళనాడు బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమిళనాడులో ఇక్కడంతా చురుగ్గా మహిళా సంఘాల సభ్యులు లేరని, అక్కడి బ్యాంకులు ఇక్కడంతా విరివిగా రుణాలు ఇవ్వడంలేదని బృందం సభ్యులు తెలిపారు. అన్ని విధాలుగా మెరుగైన విధానం తెలంగాణలో ఉన్నదని, అన్ని స్థాయిల్లో చురుగ్గా పనిచేస్తున్నారని, మహిళా సంఘాల సభ్యులకు అవగాహన, చైతన్యం బాగున్నదని ప్రశంసించారు. ఈ తరహా విధానాన్ని తమిళనాడులో కూడా అమలుచేయడానికి ప్రయత్నిస్తామని టీఎన్సీడీడబ్ల్యూ సీవోవో అస్రాన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకు ఎంతో తోడ్పాటునందిస్తున్నాయని కొనియాడారు. తమిళనాడు బృందంలో పిచ్చయ్, మాధ్యఇంద్రా ప్రియదర్శిని, కవిత, సుందరం, మూర్తి, కాళిదాసు ఉన్నారు. తెలంగాణకు చెందిన సెర్ప్ డైరెక్టర్ వై నర్సింహారెడ్డి, సెర్ప్ అధికారులు స్వామి పాల్గొన్నారు.