హైదరాబాద్, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ) : తిరుమలలో శ్రీవారి భక్తులకు 10 రోజులపాటు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం అన్నమయ్య భవన్లో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకమండలి నిర్ణయాలను వెల్లడించారు. కరీంనగర్‌లోని పద్మావతి, ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్లతోపాటు అదనంగా మరో రూ.10 కోట్లు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయించినట్టు చైర్మన్ నాయుడు తెలిపారు.
బ్రహ్మోత్సవ బహుమానంగా టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వా మి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్లతో అతిథి భవన నిర్మాణం, కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం వద్ద వసతి సముదాయం, సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. నవంబరు 17 నుంచి 25 వరకు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.