భీంపూర్, నవంబర్ 13: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి సరిహద్దు తాంసి(కె), గొల్లగఢ్ వైపు వెళ్లే రోడ్డుపై శనివారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. పిప్పల్‌కోటి రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులకు ఆదిలాబాద్ నుంచి వాహనంలో డీజిల్ తీసుకొస్తున్న డ్రైవర్ రాజాసింగ్‌కు బోర్లకుంట వద్ద 4 నాలుగు పెద్దపులులు కనిపించాయి. వెంటనే ఆయన వాహనం ఆపి తన ఫోన్లో వాటిని వీడియో తీశాడు. వీడియోను రిజర్వాయర్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్, సమీప గ్రామాల సర్పంచ్‌లకు పంపించాడు. వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఆదివారం ఉదయం డీఎఫ్‌వో రాజశేఖర్, ఎఫ్ఆర్వో గులాబ్‌సింగ్, ఎఫ్‌ఎస్‌వోలు ప్రేమ్‌సింగ్, గులాబ్, ఎఫ్‌బీవోలు శరత్‌రెడ్డి, కేశవ్‌లతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పులి అడుగులను గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో పులి సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, స్థానికులు ఆందోళన చెందవద్దని డీఎఫ్‌వో సూచించారు. సీసీ నైట్‌విజన్ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని, తమ సిబ్బంది, యానిమల్ ట్రాకర్స్‌తో రాత్రింబవళ్లు తిరుగుతున్నారని వివరించారు.