కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్టు తెలుస్తున్నది. చంద్రపూర్ జిల్లా సావోలి తాలూకా రుద్రాపూర్ గ్రామానికి చెందిన బాబురావు బుద్దజి కాంబ్లే(65) గురువారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా పులిదాడి చేయడంతో మృతిచెందారు.
మూల్ తాలూకాలోని కంటపేట్లో పశువుల కాపరి లహాను సోపాంకర్(54), సాల్వి తాలూకా కేడి గ్రామానికి చెందిన ఎలిటివార్ స్వప్న(50) పులుల పంజాకు బలయ్యారు. స్వప్న పత్తి ఏరేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకొన్నది. పులుల వరుస దాడులతో సరిహద్దు గ్రామాల ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. చంద్రపూర్, గడ్చిరోలితోపాటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు పులుల ఆవాసానికి అనుకూలంగా మారడంతో తడోబా, అంధేరి నుంచి సంచారం బాగా పెరిగింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, పశువుల కాపరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగిస్తున్నారు.