హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఆ పులి బోను దాకా వచ్చింది. అటవీశాఖ అధికారులు పన్నిన ఉచ్చుల్లో పడ్డట్టే పడింది. కానీ, అంతలోనే వెనుదిరిగి వెళ్లిపోయింది. చివరకు అటవీశాఖ అధికారులకు నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో కొద్దిరోజులుగా పులి సంచరిస్తున్నది. పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి పాండవులపాలెం, పోతులూరు ప్రాంతాలవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనిని పట్టుకొనేందుకు అటవీశాఖ సిబ్బంది మూడు చోట్ల మూడు బోనులు ఏర్పాటు చేశారు. ఆయా బోన్ల వద్ద పశుమాంసం ఎరగా వేశారు.
శనివారం రాత్రి శరభవరంలో ఏర్పాటుచేసిన బోను వద్దకు వచ్చిన పులి, బోనులోకి వెళ్లకుండా వెనుదిరిగి వెళ్లిపోయినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ పులి వయసు నాలుగైదు ఏండ్లు ఉంటుందని, అందుకే దూకుడుదనం ప్రదర్శిస్తున్నదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. దీనిని పట్టుకొనేందుకు మరో రెండు బోన్లు ఏర్పాటుచేస్తున్నారు. పులికి భయపడి వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.