హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రానిక్స్, భౌతిక శాస్త్ర అవసరాలకు అనువైన ఆధునాతన లేజర్ టెక్నాలజీని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దీటుగా పనిచేస్తూ, అతి తక్కువ కాలంలో శక్తిమంతమైన కాంతి తరంగాలను విడుదల చేసేలా దీన్ని తయారుచేశారు. టేబుల్‌టాప్ లేజర్ సిస్టంగా పిలిచే ఈ విధానం ద్వారా భారీ మొత్తంలో ఎలక్ట్రానిక్ తరంగాలను ప్రసారం చేయడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది అతి వేగంతో ప్రయాణిస్తూ ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మకంగా మారుతుందని వెల్లడించారు. సాధారణ ఎలక్ట్రాన్లను క్షణాల్లో మెగా ఎలక్ట్రానిక్ వోల్ట్గా రూపాంతరం చేయగలదని వివరించారు. ఈ లేజర్ టెక్నాలజీని సులభంగా వినియోగించవచ్చు. నిర్వహణ వ్యయం కూడా తక్కువ. మైక్రోస్కోపిక్ అధ్యయనాల్లోనూ కీలకంగా మారనున్నది.