హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వేత్తల సదస్సుగా పేరుగాంచిన టై గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ వేదికగా నిలువనున్నది. డిసెంబర్ 12 నుంచి 14 వరకు హెచ్ఐసీసీలో ఈ సదస్సును నిర్వహించాలని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ) హైదరాబాద్ చాప్టర్ నిర్ణయించింది. ఈ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నట్టు చాప్టర్ ప్రతినిధులు వెల్లడించారు. టై గ్లోబల్ సమ్మిట్ పోస్టర్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ఆవిష్కరించారు.
టీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సమన్వయకర్త మహేశ్ బిగాల ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ ఆర్తో సమావేశమయ్యారు. అక్టోబర్ 22న ఆస్ట్రేలియాలో నిర్వహించే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహావిష్కరణతోపాటు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎన్నారైల అభిప్రాయాలను కేటీఆర్‌కు వివరించారు.