ఒక డీఎస్పీ. ఆయన కింద మరో సీఐ. వారిపై ఒకటో రెండో కైంప్లెంట్స్ వస్తే.. ఆ ఏసీబీ వాళ్లు సైతం ‘ఏమో పోనీలే’ అని వదిలేసేవారేమో! కానీ.. వారిద్దరి కాంబినేషన్లో ఏ కేసు పట్టుకున్నా.. లక్షల్లో డబ్బు ముట్టనిదే ముగించేవారు కాదట! వీరిద్దరి ఆగడాలపై ఏసీబీకి వరుసగా ఫిర్యాదుల ఫోన్లు రావడంతో వలపన్ని ఏకంగా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన వ్యవహారంలో స్టేషన్లోనే ఇద్దరినీ పట్టుకున్నారు. ఒక్కో కేసు నుంచి ఒక్కో కోణంలో కూపీ లాగుతుంటే ఏసీబీ అధికారులకు దిమ్మతిరిగినంత పనైందట! పట్టుబడిన ఆ డీఎస్పీ వెనుక ఉన్నది ఏకంగా బిగ్ బ్రదర్ అని తెలిసి అవాక్కయ్యారట!. ‘ఆయన అండగా ఉంటే ఉన్నారు కానీ, మరీ లక్షల్లో దండుకోవాలా?’ అనడిగితే.. ‘ఏం చేస్తాం సార్.. పోస్టింగ్‌ల కోసం ఇచ్చిన డబ్బులు పూడ్చుకోవాలి కదా?’ అనే సమాధానం రావడంతో ఏం చేయాలో పాలుపోక చివరికి నోటీసులిచ్చి, కాసేపు విచారణ చేపట్టి.. రాత్రికి ఒక క్లారిటీతో ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీవ్రంగా అబాసు పాలవుతున్నది. ఆ శాఖలో ఏడాదిన్నరగా జరుగుతున్న పోస్టింగ్‌ల వెనుక ముగ్గురు రాజ్యాంగేతర శక్తులున్నట్టు పోలీసు ఉన్నతాధికారులే కోడై కూస్తున్నారు. క్షేత్రస్థాయిలోఅత్యంత కీలకమైన సీఐ, డీఎస్పీ(ఏసీపీ) పోస్టుల బదిలీల్లో ఈ అదృశ్య శక్తుల హస్తం లేనిదే ఏ పనీ జరగడం లేదని తెలుస్తున్నది. బిగ్ బ్రదర్ ఆదేశించడం, అడ్వైజర్ అమలు చేయడం, వాటి లావాదేవీలను చోటా భాయ్ చూడటం పరిపాటిగా మారినట్టు సమాచారం. షాడో హోం మంత్రిగా బిగ్ బ్రదర్, మరో ఇద్దరు కలిసి తెరవెనుక రాజకీయం చేస్తూ అత్యంత కీలకమైన పోలీసు వ్యవస్థను శాసిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలను ఆ ముగ్గురు రాజ్యాంగేతర శక్తులు లెక్క చేయడం లేదన్న చర్చ నడుస్తున్నది. వారికి నచ్చినన్ని డబ్బులు తీసుకోవడం, కావల్సిన పోస్టింగ్‌లు ఇవ్వడం ఏడాదిన్నరలో ఇదే పనిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చి మరీ పోస్టింగులు తెచ్చుకున్న పోలీసులు.. కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ కావడంతో ఆ డబ్బును తిరిగి వసూలు చేసేందుకు ఇష్టారీతిన లంచాలు వసూలు చేస్తున్నట్టు ఇటీవలి ఓ ఏసీబీ కేసు తేటతెల్లం చేస్తున్నది. అలా డబ్బులిచ్చి పోస్టింగ్ పట్టి, వాటిని సంపాదించుకునే క్రమంలో లంచాలకు మరిగి ఏసీబీకి చిక్కిన ఓ డీఎస్పీ ఈ బాగోతాన్ని చెప్పకనే చెప్పినట్టు సమాచారం.
సదరు డీఎస్పీ గురించి ఆరా తీస్తే.. ఎకరాలకు ఎకరాల భూములు, కోట్ల కొద్దీ నగదు వెనకేసుకున్నారని తెలిసింది. ఆ డీఎస్పీ తాను ఇటీవల ఉన్న పోస్టులోకి వచ్చేందుకు గతంలో బిగ్ బ్రదర్‌కు భారీగానే ముట్టజెప్పారని వినికిడి. ఆ డబ్బులు తిరిగి సంపాదించుకొనేందుకు ఈయన తొక్కిన అడ్డదారులు అన్నీఇన్నీ కావని, ఏకంగా ఏ కేసు పట్టుకున్నా లక్షల్లో వసూలు చేసేవారని సమాచారం. గతంలో ఆయన సైబరాబాద్, నిజామాబాద్, ఖమ్మం కమిషనరేట్లలో పలు చోట్ల పనిచేసినట్టు తెలిసింది.
గతంలో బదిలీల సందర్భంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చేసిన రికమండేషన్‌కు కొంత విలువ ఉండేది. వైఎస్ హయాంలో ఆ రికమండేషన్ 30 శాతం వరకు ఉంటే, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 35 శాతం ఉండేది. బీఆర్ఎస్ హయాంలో స్థానిక ప్రజా ప్రతినిధులను సంప్రదించి పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకునేది. ఇప్పుడా పరిస్థితి లేదని పోలీసులే చెప్తున్నారు. ఎవరి రికమండేషన్ అయినా బిగ్ బ్రదర్ జాన్తానై అంటున్నారని, ఆయన చెప్పిన వారికే.. డబ్బులిచ్చిన వారికే పోస్టింగులు అని ముఖం మీదే చెప్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులే వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని ఓ సబ్ డివిజన్‌కు చెందిన ఓ కీలక మంత్రి ఏరికోరి ఓ ఏసీపీని తీసుకొస్తే.. కేవలం ఆరు నెలల్లోనే ఆయనను బదిలీ చేసి, ఆ స్థానంలో డబ్బులిచ్చిన వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చినట్టు సమాచారం. బిగ్ బ్రదర్, అతడి అనుచరుల లొల్లిపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.
కొన్ని నెలల క్రితం జరిగిన పోస్టింగ్‌లలో ఓ డీఎస్పీ ఏకంగా రూ.75 లక్షలను బిగ్ బ్రదర్‌కు ఇచ్చి.. తాను కోరుకున్నచోటు హైదరాబాద్ నగరంలోని ఓ కీలక ప్రాంతానికి ఏసీపీగా వచ్చినట్టు తెలిసింది. ఇక సైబరాబాద్‌లో అత్యంత కీలకమైన ఓ ఏసీపీ పోస్టుకు సైతం లక్షల్లోనే నిధులు ముట్టినట్టు సమాచారం. ఇటీవల జరిగిన అడిషనల్ ఎస్పీ పోస్టింగుల్లో సైతం బిగ్ బ్రదర్ చక్రం తిప్పి రూ.కోట్లు వెనకేసుకున్నట్టు విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసం పోలీసుశాఖలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, పోస్టింగ్‌ల కోసం వెళ్లేవారు.. నిర్దేశించిన సమయంలోపు మాత్రమే, చెప్పిన చోటుకు రావాలని తన ప్రైవేట్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు టాక్ నడుస్తున్నది. ఆ బ్రదర్ చెప్పినట్టు చేయడం ‘చోటా భాయ్’ పనైతే.. వారికి ఏ ఇబ్బందులూ రాకుండా చూసుకోవడం ఆ అడ్వైజర్ బాధ్యత! దీంతో ఆ చోటా భాయ్‌కి నగరంలో పలువురు డీసీపీ స్థాయి అధికారులు వత్తాసు పలకడం పరిపాటిగా మారింది. వారే సిండికేట్‌గా మారి ఉన్నతాధికారులను బెదిరించే స్థాయికి వచ్చారంటే.. ఈ ముగ్గురి అండ వారికి ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ పోలీసుశాఖలో ఎస్వోటీ, టాస్క్‌ఫోర్స్ విభాగాలు ఎంతో కీలకం. ఒక్కమాటలో చెప్పాలంటే పోలీసు డిపార్ట్మెంట్కు గుండెకాయ వంటివని చెప్తారు. అక్రమంగా పోయే వేటినైనా ఈ రెండు విభాగాలే డీల్ చేస్తుంటాయి. అట్లాంటి కీలకశాఖలను సైతం సదరు బిగ్ బ్రదర్, సదరు అడ్వైజర్, చోటా భాయ్ మేనేజ్ చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కీలకమైన ఆ రెండు విభాగాల్లోనూ వారు చెప్పిన వారికే పోస్టింగులు ఇప్పించే వ్యవస్థను సిద్ధం చేసుకున్నారని తెలిసింది. వారు చెప్తేనే పోస్టింగులు.. వారు ఆదేశిస్తేనే ఎస్వోటీ దాడులు అన్నట్టుగా వ్యవహారం సాగుతున్నదని తెలుస్తున్నది. ఇటీవల వారి అనుకూల డిజిటల్ పత్రికలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపై వరుసగా వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఆ కథనాలు రావడం వెనుక ఈ రెండు కీలక విభాగాలు చురుగ్గా పనిచేశాయని తెలిసింది. ఎస్వోటీ అనేది చాలా కీలకమైనది కాబట్టే.. వారి అండర్లో ఉంచుకున్నారని తెలిసింది. ఆ అస్ర్తాన్ని ఎవరిపై ప్రయోగిస్తే వారిపైనే దాడులు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తున్నది.
తెలంగాణ పోలీసుశాఖలో మునుపెన్నడూ లేనంతగా కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. స్టేషన్‌కు వచ్చే వారి సమస్యలను వదిలేసి.. వారిని ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఆ సమస్యను తమ వద్దే రెండ్రోజులు నాన్చిన తర్వాత ‘నీకు న్యాయం జరగాలంటే నాకేంటి?’ అంటూ అడుగుతున్నారు. దీంతో చేసేది లేక ఎంతోమంది స్టేషన్లలోనే ఎంతోకొంత సెటిల్ చేసుకుంటున్నారు. కొందరు పోలీసుల అవినీతిని భరించలేక ఏకంగా ఏసీబీకి కాల్స్ చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో రెవెన్యూ విభాగం తర్వాత.. పోలీసుశాఖదే రెండో స్థానం. ఇలా పట్టుబడిన వారిలో ఎవరు బిగ్ బ్రదర్ నుంచి పోస్టింగ్ పొందిన వారిలో ఉన్నారని ఆరా తీయగా నల్లగొండ, వరంగల్, హైదరాబాద్ జిల్లాల నుంచి కొన్ని పేర్లు బయటకువచ్చాయి. ‘బయటపడిన వారే ఇంతమంది ఉంటే ఇంకా బయటిపడని వారు ఎంతమంది ఉన్నారో.. బిగ్ బ్రదర్‌ను ఎంటర్టైన్ చేస్తున్న అసలు బ్రదర్, వారికి అండగా ఉన్న అడ్వైజర్, చోటా భాయ్‌కే తెలియాలి’ అని పోలీసులు చర్చించుకుంటున్నారు.
పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేసే హోం మంత్రి లేకపోవడంతో అధికార కాంగ్రెస్‌కు సంబంధించిన ముగ్గురు నేతలు షాడో హోంమంత్రులుగా కొనసాగుతున్నట్టు ప్రచా రం జరుగుతున్నది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దందాలు, దండుకోవడాలు మొదలుపెట్టిన సీఐ, డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు వారితో అంటకాగుతున్నారు. షాడో నేతల అండతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. నగరంలోని మూడు కీలక కమిషనరేట్ల పరిధిలో పలువురు అవినీతి అధికారులు ‘దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్న చందం గా దందాలకు పాల్పడుతున్నారు. సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారు. రియల్ ఎస్టేట్‌లో దందాలకు దిగుతున్నారు. బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన న్యాయం చెప్తున్నారు. అక్రమార్కులు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడుతూ సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ముగ్గురు డీసీపీలు తరచూ నార్సింగి ప్రాంతంలో కలుస్తూ సెటిల్మెంట్ల గురించి చర్చించుకుంటూ, వారి అక్రమార్జనను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులుగా పెడుతున్నారనేది పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. అయినా ఇలాంటి కల్తీ ఖాకీలపై పోలీసుశాఖ నుంచి ఎలాంటి చర్యలూ లేకుండా పోయాయి.
తానే హోంశాఖ మంత్రిగా ఫీలవుతున్న ఆ బిగ్ బ్రదర్‌కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బిగ్ బ్రదర్ పుట్టినరోజున పోలీసు వ్యవస్థలోని కీలక అధికారులంతా అక్కడే తిష్టవేశారట. బొకేలు, బహుమతులు ఇవ్వడంలో రాజకీయ నేతలను మించిపోయారట. వన్ స్టార్, టూ స్టార్, త్రీస్టార్ పోలీసు వాహనాలే అక్కడ ఎక్కువగా దర్శనమిచ్చాయని ఓ పోలీసు అధికారి చెప్పారు. కాగా, ఎవరికి వారే రహస్యంగా వెళ్లి అతడిని కలిసి వస్తుండగా ఒకరికొకరు తారసపడితే కిమ్మనకుండా చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ జారుకున్నారని వినికిడి. డీఎస్పీ నుంచి ఉన్నతాధికారుల వరకూ ఆయనను నేరుగా కలిసి విష్ చేశారంటే ఆ వ్యక్తి ప్రభావం పోలీసుశాఖపై ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని పలువురు స్పష్టంచేస్తున్నారు. అయితే, కొందరు సీనియర్ పోలీసు అధికారులు సైతం కుదిరితే ప్రత్యక్షంగా, లేకపోతే ఫోన్లో పరోక్షంగా కాల్ఆన్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ రోజు వారు ఏ డ్యూటీ చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెబుతున్నారట!
పోలీసు బాస్ అంటే భయం లేకపోవడంతో, వ్యవస్థను పర్యవేక్షించే హోంమంత్రి లేకపోవడంతో పలువురు హోంగార్డుల నుం చి డీఎస్పీల వరకు లంచావతారులుగా మా రుతున్నారు. స్టేషన్లకు వచ్చే మహిళలను లొంగదీసుకోవడం, లొంగకపోతే లైంగికదాడి చేయడం వంటి ఘటనలు పోలీసుశాఖకు మాయని మచ్చను తీసుకొచ్చాయి. ఇక పోలీసులే స్టేషన్లలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా లంచాలు పుచ్చుకుంటూ దొరకడం దారుణమనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది, ఈ ఏడాది ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో రెవెన్యూ వ్యవస్థ తర్వాత పోలీసుశాఖ సిబ్బందే రెండో స్థానంలో ఉన్నారు. 20కి పైగా రెడ్‌హ్యాండెడ్ కేసులు ఉండగా వాటిల్లో 30 మంది వరకు పోలీసులు పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. సివిల్ తగాదాల్లో తలదూర్చడం, ఫ్యామిలీ గొడవల్లో సెటిల్మెంట్లు చేయడం, అక్రమంగా సంపాదించడం, డబ్బులిచ్చినవారికే వత్తాసు పలకడం, సామాన్యులను హింసించడం, పోలీసుల దౌర్జన్యాలను ప్రశ్నించిన విలేకరులపై తప్పు డు కేసులు పెట్టడం, పార్టీల నేతలకు కొమ్ముకాయడం వంటివి పోలీసుశాఖలో నిత్యకృత్యంగా మారాయనే విమర్శలు వస్తున్నాయి.