హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎప్పుడో ఇరవై, పాతిక ఏండ్ల క్రితం తెలంగాణకు మంజూరైన రైల్వే ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికావడం లేదు. మరో ఐదారేండ్లకైనా పూర్తవుతాయన్న నమ్మకం కలగడం లేదు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ తెలంగాణ పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరే కారణంగా కనిపిస్తున్నది. మునీరాబాద్-మహబూబ్నగర్, కోటిపల్లి-నర్సాపూర్, మనోహరాబాద్-కోటపల్లి రైల్వే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అత్యంత ఆలస్యంగా జరుగుతున్న పెండింగ్ పనుల జాబితాలో ఇవి వరుసగా 1, 3, 5 స్థానాల్లో ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అధికారులు నివేదికలో పేర్కొన్న అంచనాల ప్రకారం రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు మరింత జాప్యం జరిగే అవకాశాలున్నాయి. 1997లోనే ఆమోదం లభించిన మునీరాబాద్-మహబూబ్నగర్ నూతన రైల్వేలైన్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నది.
కానీ 2029 నాటికైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? లేదా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే ప్రాజెక్టు 2001లో మంజూరైంది. దానిని 2009లో పూర్తి చేయాలి. కానీ 216 నెలల ఆలస్యంగా 2027 పూర్తవుతుందని భావిస్తున్నారు. మనోహరాబాద్-కోటిపల్లి కొత్త రైల్వేలైన్ 2006 ఏప్రిల్లో మంజూరైంది. అది 2010లో పూర్తి కావాల్సి ఉన్నది. ఇది పూర్తి కావడానికి 2025 వరకు సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టు రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ హయాంలో కూడా తీవ్ర జాప్యమే జరిగింది. రాష్ర్టానికి కొత్త ప్రాజెక్టులను మంజురు చేయడంతోపాటు మంజూరైన పనులను వేగవంతంగా పూర్తిచేయడంలోనూ అలసత్యం కనిపిస్తున్నది. మంజూరైన రైల్వే ప్రాజెక్టులకు నిధుల విడుదల, టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం, భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపుల ఇలా ప్రతి విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్నది.