ఆత్మకూర్(ఎస్), జూలై 17: క్వారీ గుంత లో మునిగి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం బొప్పారంలో చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడకు చెందిన తిప్పారెడ్డి శ్రీపాల్‌రెడ్డి (40) ఏపీలోని నరసరావుపేటకు చెందిన తన స్నేహితుడు చామల రాజు కుటుంబంతో కలిసి అత్తగారి ఊరైన బొప్పారం గ్రామానికి రెండ్రోజుల క్రితం వచ్చారు. బుధవారం ఉదయం పల్లె అందాలను చూద్దామని శ్రీపాల్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు చేతన్‌రెడ్డి, రాజు, ఆయన ఇద్దరు కూతుర్లు ఉషాంక (12), రిషిక, శ్రీపాల్‌రెడ్డి వదిన కూతురు వర్షిత కలిసి బయటకు వెళ్లారు.
శ్రీపాల్‌రెడ్డి మామ ఉపేందర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లివస్తూ చెరువు సమీపంలో ఉన్న క్వారీని చూసి ఆగారు. క్వారీలో నీళ్లు కనిపించడంతో సరదాగా ఈత కొడుదామనుకున్నారు. చేతన్‌రెడ్డి నీళ్ల లోతు చూసి బయటకు వచ్చేలోపే రాజు, ఆయన పెద్ద కూతురు ఉషాంక నీటిలోకి దిగ గా జారిపడి లోపలికి వెళ్లిపోయా రు. వారిని కాపాడే ప్రయత్నం లో శ్రీపాల్‌రెడ్డి కూడా నీటిలో మునిగాడు. అదే సమయంలో రాజు చిన్న కూతురు రితిక కూడా నీళ్లలోకి జారింది. చేతన్‌రెడ్డి రితికను మాత్రం బయటకు తీసుకురాగలిగాడు. అప్పటికే రాజు, ఉషాంక, శ్రీపాల్‌రెడ్డి పూర్తిగా నీటిలో మునిగిపోయారు. స్థానికులు వచ్చేసరికి శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఉషాంక ప్రాణాలు వదిలారు. శ్రీపాల్‌రెడ్డి ఖమ్మంలో బిల్డర్‌గా, రాజు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.