తూప్రాన్/కామారెడ్డి మే 17 : రాష్ట్రవ్యాప్తంగా శనివారం పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి చెందారు. తూప్రాన్‌లో ఇద్దరు బాలురు, కామారెడ్డి జిల్లాలో ఓ మేకలకాపరి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ 11వ వార్డు పడాలపల్లికి చెందిన నడిపల్లి యశ్వంత్ (14), పంబల్ల ప్రసాద్ (14), మొకద్దం కిరణ్ శనివారం క్రికెట్ ఆడుదామని పడాలపల్లికి సమీపంలోని ఊరచెరువు మైదానంలోకి వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా గాలివాన రావడంతో చెట్లవైపు పరుగులు తీశారు.
కాసేపటికే యశ్వంత్, ప్రసాద్, కిరణ్ తలదాచుకున్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో నడిపల్లి యశ్వంత్, పంబల్ల ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. కిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. కిరణ్‌ను మెరుగైన వైద్యం కోసం ములుగులోని ఆర్వీఎం దవాఖానకు తరలించారు. బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటే రు ప్రతాప్‌రెడ్డి పడాలపల్లిలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, రూ. 10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని పరిధిపేట గ్రామానికి చెందిన మాదిరే సురేశ్ (28) రోజుమాదిరిగానే మేకలను మేపడానికి గ్రామశివారులోకి వెళ్లాడు. జీవాలను మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండేండ్ల పాప, నెల వయసున్న బాబు ఉన్నాడని స్థానికులు తెలిపారు.