పర్వతగిరి, మార్చి 8 : ఎస్సారెస్పీ కెనాల్లోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులో శనివారం జరిగింది. పర్వతగిరి సీఐ రాజగోపాల్, బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మం డలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్(45) వరంగల్లో ఎస్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు.
రెండో శనివారం, ఆదివారం సెలవులు రావడంతో భార్య కృష్ణవేణి, కూతురు సాయిచైత్ర(5), కుమారుడు హర్షవర్ధన్ (2)తో కలిసి కారులో వరంగల్ నుంచి స్వగ్రామం మేచరాజుపల్లికి బయలు దేరారు. మార్గమధ్యంలో తనకు ఛాతిలో నొప్పి వస్తున్నదని చెపుతుండగానే కారు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. వెంటనే కృష్ణవేణి కారు అద్దాలను దింపి కుమారుడిని బయటకు విసిరి, తానూ దూకేసింది. కారుతో పాటు ప్రవీణ్, కూతురు చైత్ర కాల్వలో కొట్టుకుపోయారు. కృష్ణవేణిని స్థానికులు కాపాడగా, కుమారుడు అప్పటికే మృతి చెందాడు.