హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ దవాఖానల్లో కమీషన్ల దందా జోరుగా నడుస్తున్నది. తమ దవాఖానలకు పేషెంట్లను రిఫర్ చేసే ఆర్ఎంపీలు, పీఎంపీలకు కార్పొరేటు దవాఖానలు ఏకంగా 40% నుంచి 60% కమీషన్ ఇస్తున్నట్టు తెలిసింది. సర్జరీలకే కాకుండా వైద్య పరీక్షలు, ఓపీలకు సైతం ఆయా ప్రైవేటు దవాఖానలు కమీషన్లు ఇస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల నర్సింగ్‌హోమ్‌ల నుంచి కార్పొరేట్ దవాఖానలకు రిఫర్ చేస్తున్న వైద్యులకు సైతం కమీషన్లు భారీగా ముడుతున్నట్టు సమాచారం. గ్రామాల్లో ఆర్ఎంపీలు అమాయకులను కార్పొరేటు దవాఖానలకు రిఫర్ చేస్తూ.. అందినకాడికి కమీషన్లు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఎమర్జెన్సీ కేసుల్లో కార్పొరేట్ దవాఖానలు.. ఆయా ఆర్ఎంపీ, పీఎంపీలతో ఒప్పందాలు చేసుకొని గొలుసు పద్ధతిలో ఈ దందాను కొనసాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇటీవల నిజామాబాద్ డీఎంహెచ్‌వో ప్రైవేటు దవాఖానలకు సర్క్యూలర్ జారీ చేయడం తీవ్రతకు అద్దంపడుతున్నది.
ఆర్ఎంపీలను ప్రోత్సహించడం, వారికి కమీషన్లు ఇచ్చి పేషెంట్లను దవాఖానల్ల్లో చేర్చుకోవడం నేరం. నిబంధనలు అతిక్రమించిన వైద్యులపై కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్-2002, ఎన్ఎంసీ మెడికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆర్ఎంపీలకు మద్దతుగా నిలిచినందుకు ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశాం. నకిలీ వైద్యులపై రాష్ట్రవ్యాప్తంగా 550 కేసులు నమోదు చేశాం. వారి క్లినిక్‌లను సైతం సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా వారు మళ్లీ క్లినిక్‌లను తెరిస్తే, వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదవుతుంది. ప్రజారోగ్యం దృష్ట్యా కమీషన్ల దందాకు పాల్పడే వారిపై కూడా చర్యలు ఉంటాయి.