Rain Alert | ఈ నెల 31 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకు విస్తరించాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాల వెంబడి గత మూడు గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర వాయుగండంగా మారిందని పేర్కొంది. ప్రస్తుతం సాగర్ ద్వీపానికి ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల, దిఘాకు తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీట దూరం, బాలాసోర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఉత్తరం వైపు కదులుతూ సాగర ద్వీపం, ఖేపుపారా (బంగ్లాదేశ్) మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకొని ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గంగానది, బెంగాల్ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కేంద్రం వరకు ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. గురువారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వానలు పడుతాయని పేర్కొంది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
జూన్ ఒకటిన కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. జూన్ 2న భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.