Monsoon | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు, విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి కొన్నసాగుతున్నదని తెలిపింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశమున్నట్టు పేర్కొన్నది. రాగల మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత చొప్పున నమోదు కావచ్చని వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశమున్నదని వివరించింది.
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్లో 42.8 డిగ్రీలు, రామగుండం, నిజామాబాద్లో 42.2, నల్లగొండ, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో 42 డిగ్రీలు, మెదక్ 41.2, మహబూబ్నగర్లో 39.9, భద్రాచలంలో 39.4, హైదరాబాద్లో 39 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.