సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే ఆ పిల్లల పాలిట మృత్యువుగా మారింది. గోరు ముద్దులు తినిపించాల్సిన చేతితోనే ఆ మాతృమూర్తి పిల్లలకు విషమిచ్చి ఆయువు తీసింది. ఈ గుండెలు పిండే విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రుద్రారం గ్రామంలో ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు పడ్డ ఓ తల్లి చావే శరణమని భావించింది.
తన ముగ్గురి పిల్లలకు విషం ఇచ్చి చంపి ఆపై తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.