ఆసిఫాబాద్ టౌన్/నీలగిరి/ఎల్కతుర్తి, ఏప్రిల్ 15: రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే ఏసీబీ అధికారులు మూడుచోట్ల దాడులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితుడికి స్టేషన్ బెయిల్‌తోపాటు వాహనం ఇచ్చేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటూ ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కింది. ఫార్మసీకి లైసెన్స్ ఇచ్చేందుకు రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. చార్జి మెమో ఎత్తేసేందుకు ఆర్టీసీ డ్రైవర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా హుజూరాబాద్ డిపో మేనేజర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
స్టేషన్ బెయిల్‌కు 40 వేల లంచం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగూడ సమీపంలో గతనెల 31న బైకును కారు ఢీకొట్టింది. ఈ కేసులో నిందితుడైన మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన యాహిహాఖాన్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, ప్రమాదానికి కారణమైన కారును విడుదల చేసేందుకు ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి రూ.40 వేలు లంచం అడిగారు. చివరకు రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నారు. దాంతో యాహిహాఖాన్ ఏసీబీని సంప్రదించాడు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిందితుడి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఫార్మసీ లైసెన్స్‌కు 18 వేలు డిమాండ్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెంలో నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు పేరుతో దవాఖాన నిర్మించారు. దానికి అన్ని రకాల అనుమతులు రాగా ఫార్మసీ లైసెన్స్ కోసం గత నెల 26న ఆన్లైన్లో చిట్టపు సైదిరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, రెండు రకాల డాక్యుమెంట్స్, నిర్వాహకుడి సంతకాలు లేకపోవడంతో వాటిని రిజెక్టు చేశారు. ఈ నెల 8న కూడా దరఖాస్తు చేసుకొని డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్‌ను నేరుగా సంప్రదించారు. రూ.18 వేలు ఇస్తే అనుమతి ఇస్తానని సోమేశ్వర్ చెప్పడంతో చేసేది సేవా కార్యక్రమం, డబ్బులు ఇచ్చుకోలేనని బతిమాలినా వినకపోవడంతో సైదిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం కార్యాలయంలోనే సోమేశ్వర్ రూ.18 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ నుంచి కూడా లంచం
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లికి చెందిన తాటికొండ రవీందర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 12న తన బంధువు చనిపోవడంతో రవీందర్ వెళ్లాడు. దీంతో డిపో మేనేజర్ శ్రీకాంత్ డ్రైవర్ రవీందర్‌కు ఆబ్సెంట్ వేశాడు. అనంతరం డ్రైవర్ రవీందర్ విధులకు వెళ్లగా.. మూడు రోజులు ఆబ్సెంట్ వేసి చార్జి మెమో ఇచ్చాడు. చార్జి మెమోను ఎత్తివేసేందుకు రూ. 30 వేలు ఇవ్వాలని డ్రైవర్‌ను మేనేజర్ డిమాండ్ చేశాడు. మొదటగా డ్రైవర్ రూ.10 వేలను లంచంగా ఇచ్చాడు. మిగతా రూ.20 వేలు ఇవ్వాలని డిపో మేనేజర్ డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.20 వేలను తీసుకునేందుకు ఎల్కతుర్తిలోని ఓ హోటల్‌కి డీఎం శ్రీకాంత్ రాగా, రవీందర్ డబ్బులను ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.