కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 24: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలముకున్నాయి. వేల సంఖ్యలో భద్రత దళాలు కరిగుట్టలను చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్‌లో వాయుసేన వేగాన్ని పెంచింది.. ఆపరేషన్ ‘కగార్’ (Operation Kagar) పోరు తుది దశకు చేరుకునే పరిస్థితులు నెలకొన్నాయి.. సెర్చింగ్ ఆపరేషన్ నిలిపివేయాలంటూ మావోయిస్టు పార్టీ నేతలు రాసిన లేఖను కేంద్రం కొట్టిపడేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం మావోయిస్టులు, భద్రత దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం.
2026 మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్టు పార్టీని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడవుల పైకి బ్రహ్మాస్త్రాలను వదిలింది. ఇందులో భాగంగానే ఆపరేషన్ ‘కగార్’ పేరుతో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో అంతిమ యుద్ధం కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్ నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖను రాసింది. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, భద్రతా దళాలను క్యాంపులకు పరిమితం చేయాలని, తాత్కాలికంగా నెల రోజులపాటు సెర్చింగ్ ఆపరేషన్ ఆపివేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ కొన్ని రోజులకే జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు వివేక్ సహా 8 మంది మావోయిస్టులు నెలకొరిగారు. ఈ ఘటన చోటు చేసుకున్న మరుసటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి. సుమారు పదివేల మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది. సీఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సాయుధ బలగాలు కరిగుట్టలను జల్లెడ పడుతున్నట్లు సమాచారం.
ఆపరేషన్‌లో భాగంగా వాయుసేన కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు అనుసంధానంగా దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎత్తయిన గుట్టలతో సుమారు 53 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. అందుకే మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలతో వారి ముఖ్య అనుచర గణమంతా ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని తలదాచుకున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందింది. ఎప్పటినుంచో అదును కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీ ముఖ్య నేతలు అంతా ఇక్కడే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మొహరింపజేసి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బడే చొక్కా రావు అలియాస్ దామోదర్, మాస్టర్ మైండ్ హిద్మ తోపాటు కీలక నేతలు ఉన్నట్లు పోలీస్ అధికారులు భావిస్తున్నారు. దీంతో కర్రెగుట్టలకు ఉన్న అన్ని మార్గాలను ఏకకాలంలోనే చుట్టుముట్టి మావోయిస్టులు తప్పించుకునేందుకు వీలు లేకుండా వాయిసేన సహకారంతో సైతం ఈ ఆపరేషన్ దూకుడు పెంచినట్లు అవగతం అవుతుంది.
మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలే టార్గెట్ గా గత మూడు రోజులుగా తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దుల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జవాన్లు పై చేయిగా నిలిచినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఎదురు కాల్పుల్లో సుమారు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే కరిగుట్టల చుట్టూ భద్రతా బలగాలు మోహరించడంతో కొంచెం గందరగోళ వాతావరణం నెలకొంది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారా..? లేదా..? అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.